సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. తన అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది కృతి. ఇక తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చేసింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. ఏకంగా లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో చైతూతో జతకట్టింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఇలా వరుస విజయాలను అందుకొని స్టార్ గా మారిపోయింది.
అయితే ఆ తర్వాత ఈ అమ్మడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. వెంటనే చేసిన మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా తాను ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. కృతి రామ్ పోతినేని తో కలిసి వారియర్ అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమాకు లింగు స్వామి దర్శకత్వం వహించారు. ఆయన తమిళ్ దర్శకుడు కావడంతో ఆయన తెలుగు భాషలో కొంచం తమిళ్ యాస కూడా మిక్స్ అయి ఉంటుంది. దాంతో కృతికి ఆయన తెలుగు అర్ధం కాలేదట. దాంతో ఆమె కాస్త ఇబ్బంది పడిందట. అయితే డైలాగ్స్ విషయంలో రామ్ హెల్ప్ చేశాడని తెలిపింది. ఆ తర్వాత ఆయన తెలుగును అర్ధం చేసుకుందట ఈ చిన్నది.