
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత ఎం.ఎస్. రాజు, తన సినీ జీవితంలోని ఎత్తుపల్లాలను, ముఖ్యంగా దేవి చిత్రం తన జీవితానికి ఎంతటి కీలకమైన మలుపు తిప్పిందో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 27 సంవత్సరాల వయస్సులోనే నిర్మాతగా మారారు. శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్ వంటి చిత్రాల తర్వాత రాజు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. “స్ట్రీట్ ఫైటర్ సినిమా తీసి దాదాపు స్ట్రీట్స్కి వచ్చేసాను మళ్ళీ. స్ట్రీట్ అంటే మొత్తం ఏదైతే సంపాదించానో కొంప కూడా అమ్ముకుని… అన్నీ అమ్ముకుని వచ్చాం” అని ఆయన ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవి సినిమా ఆయనకు ఒక పెద్ద ఆశాదీపంగా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టిందని, గ్రాఫిక్స్, ఆర్థికపరమైన అంశాలు అన్నీ ఎంతో ఒత్తిడిని కలిగించాయని తెలిపారు. “డబ్బులు, డబ్బులు, డబ్బులు టెన్షన్, టెన్షన్, టెన్షన్ తో చేసిన సినిమా” అని ఆయన పేర్కొన్నారు.
తన ఆర్థిక సంక్షోభ సమయంలో, సన్నిహితుడైన నటుడు వెంకటేష్‌ను సహాయం అడగడానికి ఎం.ఎస్. రాజు నిరాకరించారట. “ఎంత ఫ్రెండ్ అయినా మనం ఒక స్టోరీ అనే ఆబ్లిగేషన్ తో వెళ్ళాలి తప్ప నాకు వెళ్ళి హెల్ప్ చెయ్ అని ఆబ్లిగేషన్ తో వెళ్ళకూడదు ” అని ఆయన వివరించారు. తన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం వల్లే అటువంటి పరిస్థితిలో కూడా వెంకటేష్‌ను కలవలేదని, సహాయం కోరలేదని ఆయన చెప్పారు. దేవి సినిమా విడుదలకు ఒక రాత్రి ముందు వెంకటేష్ స్వయంగా రాజుకు ఫోన్ చేసి మాట్లాడారట. “ఆల్ ద బెస్ట్. నాకు ఎందుకో ఈ సినిమా కొడతాం అనిపిస్తుంది. నీ గట్స్ కి మాత్రం చాలా హ్యాట్సాఫ్. ఈ సినిమా రేపు బాగా ఆడాలని కోరుకుంటున్నాను” అని వెంకటేష్ రాజును అభినందించారట. అంతేకాకుండా, “నువ్వు నా దగ్గరికి నువ్వు ఒక ఫ్లాప్ అయిన తర్వాత నా దగ్గర రాలేదు. వస్తే మాత్రం ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు కూడా నీకు అనిపిస్తే నీకు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు. నీకు అనిపిస్తే రా. నేనైతే నీతో సినిమా చేయాలని ఉంది నీ బికాజ్ ఆఫ్ యు హావ్ ద గట్స్” అని వెంకటేష్ ఇచ్చిన ప్రోత్సాహం ఎం.ఎస్ రాజుకు ఎంతో మానసిక బలాన్ని ఇచ్చింది. ఈ ఘటన ఎం.ఎస్ రాజుకు వెంకటేష్ పట్ల మరింత గౌరవాన్ని పెంచిందట.
దేవి చిత్రం సాధించిన భారీ విజయం ఎం.ఎస్. రాజు జీవితంలో ఒక పెద్ద మలుపు. “నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి ఆ సినిమా సాల్వ్ చేసింది యాక్చువల్ గా” అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం ఆయనకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా, తన ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరిచింది. రాజు తన ఇన్నేళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, తాను నిరంతరం పోరాడుతూనే ఉన్నానని, “ఉడుము పట్టు”లా పట్టుదలతో పని చేశానని అన్నారు. ఆతర్వాత ఆయన ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి, మూడు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.