Most Recent

Bigg Boss Telugu 10: నామినేషన్స్‌లో ముకేష్ గౌడ రచ్చ.. వర్షిణి, త్రిగుణ్ ఎమోషనల్ డ్రామా

Bigg Boss Telugu 10: నామినేషన్స్‌లో ముకేష్ గౌడ రచ్చ.. వర్షిణి, త్రిగుణ్ ఎమోషనల్ డ్రామా

బిగ్ బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో హీట్ పెంచేసింది. ఒకవైపు త్రిగుణ్, వర్షిణి మధ్య ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంటే.. మరోవైపు నామినేషన్స్ సందర్భంగా ముకేష్ గౌడ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జడ్జీల మధ్య వాదోపవాదాలు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో  52వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. చివరికి ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. నామినేషన్స్‌లో వర్షిణిని ఎంపిక చేయడంతో త్రిగుణ్ తీవ్రంగా బాధపడుతున్నట్లు కనిపించాడు. తన కుటుంబం కోసం, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం కోసమే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చానని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. వర్షిణిని ఇంటికి పంపించానని తన కుటుంబ సభ్యులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించాడు. దీంతో వంశీ, శ్వేత అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు వర్షిణి కూడా త్రిగుణ్‌తో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నామినేట్ చేసినందుకు తనకు బాధ లేదంటూనే.. తనకు తెలిసిన త్రిగుణ్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో హౌస్‌లో మరోసారి ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ కొత్త పద్ధతిలో నిర్వహించారు. గోట్ లెవల్‌లో ఉన్న ముకేష్, త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూలకు జడ్జీల బాధ్యతలు అప్పగించారు. ఎల్లో లెవల్‌లో ఉన్న సభ్యుల్లో ఎవరికి నామినేట్ చేసే అవకాశం ఇవ్వాలనేది వారి వాదనలు, పాయింట్ల ఆధారంగా నిర్ణయించాల్సి వచ్చింది.

జడ్జీల్లో ఒకరు పర్మినెంట్‌గా ఉండగా, మిగతా వారు రొటేషన్ పద్ధతిలో వ్యవహరించేలా నిబంధనలు పెట్టారు. పర్మినెంట్ జడ్జీ ఎంపిక దగ్గరే కంటెస్టెంట్ల మధ్య చర్చ మొదలైంది. చివరికి నీతూను ఎంపిక చేయగా, తదుపరి పరిణామాల్లో అమన్ పర్మినెంట్ జడ్జీగా బాధ్యతలు చేపట్టాడు. మొదటి నామినేషన్ అవకాశం నరేష్‌కు దక్కింది. అతడు వర్షిణి, ఝాన్సీలను టార్గెట్ చేశాడు. టాస్కుల్లో ఆశించిన స్థాయిలో పాల్గొనడం లేదని వర్షిణిపై ఆరోపణలు చేశాడు. దీనికి స్పందించిన వర్షిణి.. బిగ్ బాస్ అనేది కేవలం గేమ్స్‌కు సంబంధించిన షో మాత్రమే కాదని, వ్యక్తిత్వానికి కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పింది. తనకు ఇటీవలే సర్జరీ జరిగిందని, అందువల్ల టాస్కుల్లో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయానని వివరించింది.

ఈ చర్చలో శివ కూడా జోక్యం చేసుకుని టాస్కుల్లోనూ వ్యక్తిత్వాన్ని చూపించవచ్చని అభిప్రాయపడ్డాడు. దీంతో వర్షిణి, శివ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. ఇక ఝాన్సీ తరచూ ఏడుస్తోందంటూ నరేష్ చేసిన ఆరోపణలకు ఆమె తన భావోద్వేగాలను సమర్థించుకుంది. చివరకు జడ్జీలు వర్షిణిపై నరేష్ చేసిన ఆరోపణలను అంగీకరించి, ఝాన్సీ విషయంలో అతడి వాదనను తిరస్కరించారు. జడ్జీల నిర్ణయాల విషయంలో ముకేష్ గౌడ పదేపదే జోక్యం చేసుకోవడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. పర్మినెంట్ జడ్జీగా నీతూ తీసుకున్న నిర్ణయంపై ముకేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుకోవడం, తమ నిర్ణయాలే సరైనవని వాదించుకోవడం కనిపించింది. నీతూ తన నిర్ణయంపై నిలబడగా, ముకేష్ కూడా వెనక్కి తగ్గకుండా వాదన కొనసాగించాడు. దీంతో నామినేషన్స్ కంటే జడ్జీల మధ్య గొడవే ఎక్కువగా హైలైట్ అయింది. తదుపరి నామినేషన్ అవకాశం శివకు లభించింది. అతడు వంశీ, సుధీర్‌లను ఎంపిక చేశాడు. వంశీ విషయంలో తన వాదనను వివరించే సమయంలో ముకేష్‌కు సంబంధించిన అంశాన్ని ఉదాహరణగా ప్రస్తావించాడు. దీంతో ముకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివతో వాదనకు దిగాడు. జడ్జీల ప్యానెల్‌లో ఉన్న దేబ్జానీ కూడా ముకేష్ మధ్యలో జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టింది. ఆ తర్వాత సుధీర్‌ను నామినేట్ చేస్తూ శివ తీవ్ర విమర్శలు చేశాడు. సుధీర్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, తన నిర్ణయాలపై నిలబడటం లేదని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలకు సుధీర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినప్పటికీ, చివరికి జడ్జీలు సుధీర్ నామినేషన్‌ను ఆమోదించి వంశీని సేవ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.