గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తోన్న జానీ మాస్టర్ వ్యవహరం ఎట్టకేలకు క్లైమాక్స్ చేరుకుంది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో అతడిని ఇటీవల గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు నార్సింగీ పోలీసులు. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా సినిమా ఇండస్ట్రీలో మొన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన జానీ.. లైంగిక వేధింపుల అభియోగాలతో ఇప్పుడు కారాగారం పాలయ్యారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. కావాలనే తనను ఈకేసులో ఇరికించారని.. వాళ్లను మాత్రం వదిలిపెట్టను అంటున్నారు జానీ మాస్టర్. తనపై లైంగిక దాడి, బెదిరింపులకు పాల్పడినట్టు మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ కెరీర్, లైఫ్ చిక్కుల్లో పడ్డాయి. మొన్నటివరకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా జానీ మాస్టర్ జీవిత చక్రం గిర్రున తిరిగి జైలు దగ్గరికొచ్చి ఆగింది.
ఇదిలా ఉంటే ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ వేయనున్నారు నార్సింగీ పోలీసులు. ఈ కేసులో అతడిని దాదాపు పదిరోజులపాటు కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు మరోవైపు జానీ మాస్టర్ పై ఫోక్స్ ఆక్ట్ నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు జానీ మాస్టర్ న్యాయవాది. ఈనెల 15న జానీమాస్టర్‌పై FIR నమోదైంది. అప్పటినుంచీ అజ్ఙాతంలోనే ఉన్నారు. గురువారం అతడిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు.. తో శుక్రవారం తెల్లవారుఝామున 4 గంటలకు హైదరాబాద్ తీసుకొచ్చారు ఎస్‌ఓటీ పోలీసులు. కేసును పర్యవేక్షిస్తున్న నార్సింగి పోలీసులకు అప్పగించారు. రహస్యంగా విచారించిన తర్వాత రాజేంద్రనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించి.. రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీమాస్టర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని, నేరాన్ని జానీ అంగీకరించాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ లైంగిక దాడి చేశాడని, ఎవరికైనా చెబితే అసిస్టెంట్‌గా తొలగిస్తానంటూ జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని, షూటింగ్ పేరుతో హోటల్స్‌కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని జానీపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా మేజిస్ట్రేట్‌కు విన్నవించారు పోలీసులు. అటు..జానీని తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.